Charlapally Terminal: హైదరాబాద్కు మరో మణిహారం చర్లపల్లి టెర్మినల్.... 3 d ago
TG : హైదరాబాద్ మహా నగరం మెడలో మరో మణిహారం చేరుతోంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎన్నో హంగులతో నిర్మించిన ఈ టెర్మినల్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతినివ్వనుంది. అత్యాధునిక సదుపాయలను, సౌకర్యాలను రైల్వే శాఖ కల్పించింది.
చర్లపల్లి టెర్మినల్లో ప్రయాణికులకు ఉచిత వైఫై సౌకర్యం కల్పించనున్నారు. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, వేచి ఉండేందుకు ఏసీ, నాన్ ఏసీ గదులను ఏర్పాటు చేశారు. టికెట్ బుకింగ్ కోసం ఇరువైపులా కౌంటర్లు ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ సెంటర్లు నిర్మించారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజూ 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. టెర్మినల్ ప్రారంభమైతే.. 25 జతల రైళ్లు ఇక్కడి నుంచి పరుగులు పెడతాయి. 13 జతల రైళ్లు ఆగుతాయి. దీంతో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల రద్దీ, ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
చర్లపల్లిలో కాగజ్నగర్ ఇంటర్సిటీ, కృష్ణా ఎక్స్ ప్రెస్, గుంటూరు ఇంటర్సిటీ, మిర్యాలగూడ ఎక్స్ ప్రెస్, పుష్-పుల్, శబరి ఎక్స్ ప్రెస్, శాతవాహన, కాకతీయ ఎక్స్ ప్రెస్, లింగంపల్లి, ఘట్ కేసర్ ఎంఎంటీఎస్, రేపల్లె ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి.